కృతజ్ఞత చూపించటం కూడా మానవీయ విలువలలో భాగమే!

ఈ కాలంలో మానవ విలువలు తగ్గిపోయినవని కొంతమంది అంటుంటే వింటుంటాం.

 

‘అసలు మానవ విలువలు అంటే ఏమిటి?’ అని ఆలోచిస్తూ ఉండేవాడిని. కానీ నాకు అర్థం కావడానికి చాలా కాలం పట్టింది. ఏడేళ్ళ క్రితం అనుకుంటాను – కాళ్ళకూరులో డా. పృధ్వీరాజ్ గారిని కలిసిన తరువాత వారిచ్చిన నిర్వచనం నాకు బాగా నచ్చింది.

 

1.    కష్టపడి పనిచెయ్యటం,

2.     నిజాయితీగా ఉండడం,

3.     తనకొచ్చిన ఆదాయంలో కొంతభాగాన్ని (వారి ఉద్దేశ్యంలో 3 శాతాన్ని) – నిస్సహాయులకు (మంచం మీద ఉన్నవారు, వంటరిగా ఉన్న వృద్ధులు వగైరా), సమాజ సేవ చేసేవారికి గాని విరాళంగా ఇవ్వడం….

….ఇది ఆయనిచ్చిన నిర్వచనం.

 

ఒక చిన్న ఉదాహరణ ద్వారా ఆయన వీటిని వివరించేవారు.

          ఒక రైతు తన గేదెను మేపడం, కడగడం, పోషించడం అంటే కష్టపడి పనిచెయ్యడమే.

పితికిన పాలను నీళ్ళు కలపకుండా అమ్మడం నిజాయితీకి నిదర్శనం.

పాలమ్మడం ద్వారా వచ్చిన లాభంలో రూపాయికి మూడు పైసల వంతున నిజంగా అవసరమైన వారికి దానం చెయ్యడం

ఈ మూడు మానవ విలువలను పెంచటానికి ఆయన ఒక పెద్ద సాంఘిక ప్రయోగం చేశారు.

          అయితే సహాయం చేసిన వారిని గుర్తు పెట్టుకోవడం, కృతజ్ఞత చూపడం కూడా మానవ విలువల్లో భాగమని నా అభిప్రాయం.

          మిత్రులు దాసి సీతారామ రాజు గారు గత నెలాఖరున EO-PRD గా పదవీ విరమణ చేసిన సందర్భంగా మొన్న (07-01-2018) ఉదయం జరిగిన సభ మామూలు పదవీ విరమణ సభ లాగా కాకుండా వినూత్నంగా జరిగింది. ఆహ్వాన పత్రికలోనే “కృతజ్ఞతాపూర్వక ఆత్మీయ కలయిక” అని రాశారు. తనకు ఇప్పటి దాకా జరిగిన జీవితంలో సహాయం చేసిన వారందరినీ పిలిచి, వారు తనకు చేసిన సహాయాన్ని అందరికీ చెప్పి, ధన్యవాదములు చెప్తూ సన్మానం చేశారు. ప్రయాణం చెయ్యలేని పరిస్థితిలో ఉన్న గురువు గారికి ఇంతకు ముందే హైదరాబాద్ వెళ్లి మరీ సన్మానం చేసి వచ్చారు.

          ఒక మనిషి ఎదగటానికి కుల, మత, ప్రాంతీయ రహితంగా సమాజం ఎంత సహాయం చేస్తుందో చెప్పకనే చెప్పారు. తన తల్లిదండ్రుల పేరుతో ఒక ధార్మిక సంస్థను ఏర్పాటు చేసి ఆ ఋణం తీర్చుకుంటున్నారు.

అతి చిన్న సహాయం చేసినవారి దగ్గర నుండి, మాట సాయం చేసినవారితో సహా  ఇంత వివరంగా గుర్తు పెట్టుకుని కృతజ్ఞతాభావం కలిగి ఉండటం సీతారామ రాజు గారి ప్రత్యేకత, అదే మానవ విలువల్లో ఒక భాగం.

          ఆ రోజు కార్యక్రమం జరిగిన తీరు చాలా సంతోషంగా అనిపించింది.

 

-డా. దాసరి రామకృష్ణ ప్రసాదు

09-01-2018

One thought on “కృతజ్ఞత చూపించటం కూడా మానవీయ విలువలలో భాగమే!

  • June 11, 2018 at 10:57 am
    Permalink

    Very nice…

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>