ప్రాణాంతక వ్యాధుల్ని నివారించాలంటే?....           (06-April-2018)

ప్రాణాంతక వ్యాధుల్ని నివారించాలంటే?
 

1842 నాటికి 33 సంవత్సరాలుగా ఉన్న మానవుని సగటు ఆయుర్దాయం కేవలం 150 ఏళ్లలో 81 ఏళ్లకు పెరిగింది. మన దేశంలో ఇది ప్రస్తుతం 63 సంవత్సరాలు! మశూచి వంటి ప్రమాదకరమైన వ్యాధి భూగోళం నుండి తరిమికొట్టబడింది. మరో నాలుగైదేళ్ళలో పోలియో వ్యాధి కూడా భూలోకం నుండి మాయం కావచ్చు.
ఐతే, పెరుగుతున్న వాతావరణ కాలుష్యం, మానవుల దురాశలు, కనీస జాగ్రత్తలైనా పాటించని బాధ్యతా రాహిత్యంతో కొన్ని కొత్త జబ్బులు మానవాళికి దాపురించాయి. ఎంతగా శాస్త్ర పరిశోధనలు జరుగుతున్నా, ఎన్ని సరికొత్త మందులను కనిపెట్టినా, క్షణక్షణ ప్రవర్థమానమౌతున్న మానవ మేధస్సు కూడా మరణాన్ని వాయిదా వేయగలదే తప్ప, దాన్ని తప్పించడం అసాధ్యం. “జాతస్యహి ధృవో మృత్యుః” – పుట్టిన ప్రతి మనిషి గిట్టక తప్పదు. కానీ అకాల మరణం చెందక, ముక్కుతూ, మూల్గకుండా, ఈసురోమని బ్రతుకీడ్చకుండా, ఉల్లాసంగా, ఆరోగ్యంగా మనిషి తృప్తికరమైన సంపూర్ణ సార్థక జీవితాన్ననుభవించాలంటే ఏం చేయాలి?
మనిషికి ప్రాణాంతక వ్యాధులివి:
1) అంటువ్యాధులు :
టైఫాయిడ్, కలరా, ప్లేగు, టి.బి., ఎయిడ్స్, హెపటైటిస్-బి, స్వైన్ ఫ్లూ వగైరా.
2) వయస్సుతో వచ్చేవి :
గుండెపోటు, కాన్సర్, పక్షవాతం వగైరా.
3) ఇవి చాలవన్నట్లు మన దేశంలో నిత్యమూ జరిగే రోడ్డు ప్రమాదాలు.
పై వ్యాధులు అస్సలెప్పటికీ మనకు రాకుండా చేయటం అసాధ్యం. మనిషికి వయస్సు పెరిగే కొద్దీ గుండెపోటు, కాన్సర్, పక్షవాతం వచ్చే అవకాశాలు పెరుగుతూ పోతాయి. ప్రయత్నిస్తే అంటువ్యాధుల బారిన పడకుండా మాత్రం చాలావరకు తప్పించుకోవచ్చు.
1920 వాటికే అభివృద్ది చెందిన దేశాలు మంచి ఆహారం, సురక్షితమైన త్రాగునీరు, పరిసరాల పరిశుభ్రతలతో టైఫాయిడ్, కలరా, ప్లేగు, టి.బి. వంటి వ్యాదుల్ని అరికట్టగలిగాయి. పోలియో, కోరింత దగ్గు, ధనుర్వాతం, కంఠసర్పి వంటి జబ్బుల్ని టీకాలతో ధనిక దేశాలు అరికట్టాయి. అత్యాధునిక రోగమైన ఎయిడ్స్ ను కూడా పూర్తిగా కాకున్నా చాలావరకు ఆయా ప్రభుత్వాల, ప్రజల అప్రమత్తతతో అవి నివారించగలిగాయి.
ఎయిడ్స్ వ్యాధి విషయంలో జాగ్రత్తలేమిటి?
అత్యధిక జనాభా సమస్యతో సతమతమౌతూ ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుచున్న మన దేశంలో ఎయిడ్స్ శరవేగంతో విస్తరిస్తున్నది. మానవాళినీ, ప్రభుత్వాలనూ గడగడలాడిస్తున్న ఈ జబ్బుకు నివారణ (Prevention) తప్ప చికిత్స లేదు.
ఎ) ప్రతి వ్యక్తీ జీవితాంతం తన జీవిత భాగస్వామితో మాత్రమే సెక్స్ సంబంధం పెట్టుకోవాలి.
బి) రోడ్డు ప్రమాదాలలో, శస్త్ర చికిత్సల్లో రక్తం ఎక్కించవలసి వస్తే ఆథరైజ్డ్ బ్లడ్ బ్యాంక్ నుండి తీసుకున్న రక్తం మాత్రమే వాడాలి.
సి) ఏ ఇంజెక్షన్ చేయించుకునేటప్పుడైనా డిస్పోజల్ సిరంజ్ మాత్రం వాడాలి.
ఈ మూడు కనీస జాగ్రత్తలతో ఎయిడ్స్ వ్యాధి రాకుండా నివారించుకోవచ్చు.
హెపటైటిస్-బి రాకుండా…?
రక్తమార్పిడి, ఇంజెక్షన్ల విషయంలో పై జాగ్రత్తలే దీనికీ వర్తిస్తాయి. వ్యాక్సిన్ కూడా ఇటీవల వచ్చింది. కాచి చల్లార్చిన నీరు త్రాగడం, ప్రయాణాల్లో కూడా ఇంటి నుండి తీసుకెళ్ళిన రక్షిత నీరే త్రాగడం, లేదా నీళ్ళ సీసాలు కొని త్రాగడం ద్వారా హెపటైటిస్ నే గాక టైఫాయిడ్, అతిసార వ్యాధులను కూడా నివారించవచ్చు.
గుండెపోటు…
50 సంవత్సరాలు దాటిన తర్వాత వచ్చే జబ్బులలో ఇదొకటి. ఇటీవలి కాలంలో చిన్నవాళ్ళకూ గుండె జబ్బులు వస్తున్నాయి. తగినంత శరీర వ్యాయామం లేకపోవడం, సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం, ధూమపానం, మద్యపానం వంటి వ్యసనాలు, మానసిక ఒత్తిడి ఈ వ్యాధికి ముఖ్య కారణాలు.

వందేళ్ళకు పైగా శరీరాన్ని బ్రతికించే గుండె విషయంలో మనం ఏ జాగ్రత్తలు పాటించాలి?

 1. కనీసం రోజుకి అరగంట సమయం చెమట పట్టేంత వేగంగా నడవాలి.
 2. కాదంటే, అరగంట నుండి గంటసేపు ఆటలాడాలి. ఎల్.కె.జి. పిల్లలకూ, హైస్కూల్ విద్యార్థులకు ఆటలాడించే సౌకర్యాలు పాఠశాలల్లో ఉంటున్నాయా? వారిని ఇళ్ళ దగ్గరైనా ఆడుకోకుండా ట్యూషన్లకు పంపే తల్లిదండ్రులే ఎక్కువ. కనీస శరీర శ్రమ లేక, స్కూలుకు నడిచైనా వెళ్ళక, ర్యాంకుల వేటలో విపరీతమైన మానసిక ఒత్తిళ్ళతో ఇంటర్ దాక – అంటే 17 ఏళ్ళు వచ్చేదాకా రాత్రింబవళ్ళు చదివిన పిల్లలు ఉత్సాహాన్ని, ఆనందాన్నీ కోల్పోయి నిస్తేజులుగా, జీవచ్ఛవాలుగా, కొన్నిమార్లు శవాలుగా మారటం ప్రమాద సంకేతం.

తమ పిల్లలకు చదువుతో బాటు ఆరోగ్యమూ ఎంతో ముఖ్యమనీ, ఆరోగ్యం లేనప్పుడెంత సంపాదించినా వ్యర్ధమేననీ, వారు ఎంత ఎదిగినా నిరర్ధకమేననీ తల్లిదండ్రులు ఎంత త్వరగా గమనిస్తే అంత మంచిది. అలాంటి చైతన్యవంతులైన తల్లిదండ్రులు తమ పిల్లల ఆటల సౌకర్యాల కోసం పాఠశాల యాజమాన్యాల మీద ఒత్తిడి తేవాలి.

పిన్నలు గానీ, పెద్దలు గానీ రోజూ ఒక్క అరగంట నడిస్తే…. ఏం జరుగుతుంది?

 • గుండెకు రక్త సరఫరా పెరిగి గుండెపోటు వచ్చే అవకాశం తరిగిపోతుంది. ఒకవేళ వచ్చినా, ప్రాణ ప్రమాదాన్ని తట్టుకోగలుగుతుంది.
 • గుండెపోటుకు ఒక కారణమైన రక్తంలోని (చెడు) కొలెస్టరాల్ తగ్గుతుంది.
 • ఉషోదయం నడక మనో మాలిన్యాలను తగ్గించి, సద్భావనలకు అంకురార్పణ చేస్తుంది. మనస్సు ప్రశాంతించి ఒత్తిడులు తగ్గిపోతాయి.

ఒక్కసారి ఊహించండి…
ప్రతి శుభోదయాన మన ఊరు ఊరంతా క్రీడా స్థలానికి వచ్చి క్రమపద్ధతిలో నడుస్తూ ఉంటే… సాయం సంధ్యలో ప్రజలంతా ఈర్ష్యాద్వేష రహితంగా ఆటలాడుతూ ఉంటే… అది నిజంగా అత్యద్భుత సుందర సుమధుర సురుచిర దృశ్యాలే!

క్యూబా రాజధాని హవానా వెళ్ళిన నా మిత్రుడు ఆ నగర ప్రజలంతా పగలంతా ఎన్ని విధాలుగా, ఎంతగానో కష్టించి పనిచేసి, సాయంత్రం పిల్లలతో సహా క్రీడా మైదానాలకు పోయి, వాలీబాల్ వంటి అన్ని ఆటలూ అడతారనీ, బాలబాలికల క్రీడల కేరింతలతో మైదానాలు నిండిపోతాయనీ చెప్పినప్పుడు అధ్భుతమనిపించింది. మన సరిహద్దు దేశమైన 140 కోట్ల చైనాలో వంద కోట్ల మంది దినసరి వ్యాయామాలు చేస్తారని తెలిసినప్పుడు ఆనందాశ్చర్యాలు కలిగాయి.
మన దేశంలో అత్యధిక జనులు టి.వి.లకు అతుక్కుపోయిన ఈ కాలంలో అలాంటి దృశ్యాలు సాధ్యమేనా అనిపిస్తున్నదా? మనిషి తలుచుకుంటే ఏది అసాధ్యం?

ధూమపానం:
త్రాగేవాళ్ళకే కాక, అందుబాటులో ఉన్న అందరికీ అనారోగ్యం తెచ్చే అత్యంత ప్రమాదకర వ్యసనమిది. పొగను త్రాగుతున్నామనుకుంటారు కొందరు. కానీ ఊపిరితిత్తులలో కాన్సర్ గా, బ్రాంకైటిస్ గా, జీర్ణాశయంలో పుళ్ళుగా, గుండెపోటుగా… ఈ పొగే చాలామంది ప్రాణాలను త్రాగి, పీల్చి పిప్పి చేస్తుందని గ్రహించే సరికే పుణ్యకాలం పూర్తవుతుంది.
బీడీ, చుట్ట, సిగరెట్లు మనం కాల్చకపోవడం కాదు, మన కుటుంబ సభ్యులని, మన ఇరుగుపొరుగు వాళ్ళని కూడా కాల్చనివ్వకూడదు. అంత్య నిష్టూరం కన్నా ఆది నిష్టూరం మంచిది. ప్రభుత్వం బహిరంగ ప్రదేశాల్లో ధూమపాన నిషేధం చేసింది మన ఆరోగ్యం కోసమే. కనుక ఈ చట్టం అమలుకు మనమే కృషి చేయాలి.

మందు కాని మందు :
ఇటీవలి కాలంలో ఈ ఆల్కహాల్ సేవనం మితిమీరి, ఎన్నో సామాజిక, ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. పులిని చూచి నక్క వాత పెట్టుకున్నట్లు ఏదో పాశ్చాత్యుల నుండి మనకబ్బింది కాదీ వ్యసనం. మన దేవతలే సురులు – సురాపానం మత్తులు! మద్యపానం చేయని అనాగరికులను అసురులని, దశ్యులని వెంటాడి, వేటాడిన ఆదర్శ పురుషులు! ఈనాడు స్త్రీ, బాల, వృద్ధుల్లో కూడా శరవేగంగా విస్తరిస్తున్న వ్యసనం మద్యపానం. ప్రభుత్వాలు కూడా పోటీలు పడి కోటానుకోట్ల సంపాదనా మార్గంగా మద్య విక్రయాన్నే నమ్ముకున్న కాలమిది!
ప్రభుత్వాలు ప్రజలకిస్తున్న కానుక మద్యం. మరి మద్యం తనను తాగే వాళ్ళకు ఇచ్చే బహుమతులు? జీర్ణాశయంలో పుళ్ళు, గుండెపోటు, కాలేయ వినాశనం, నరాల జబ్బులు, కాన్సర్…. ఈ అలవాటుకు దూరం కానప్పుడు యువత పై జబ్బులను బహుమతులుగా అందుకొని, పతనం కాక తప్పదు!

కాన్సర్ అంటే?

శరీర భాగాలలో కణాల అక్రమ పెరుగుదలే కాన్సర్. ఇది చాలా రకాలు. వయస్సు పెరిగేకొద్దీ కొందరికి ఏదో ఒక కాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. వచ్చిన తొలి దశలో కనిపెట్టి, వైద్యం చేయించుకుంటేనే ఫలితం బాగుంటుంది.
తొలి లక్షణాలు:

 1. అజీర్ణం, కడుపులో నొప్పి తరుచుగా వస్తున్నప్పుడు, ఆలస్యం చేయకుండా డాక్టర్ దగ్గరికి వెళ్తే “గ్యాస్ట్రోస్కోపీ” అనే పరీక్ష ద్వారా “జీర్ణాశయ కాన్సర్”ను గుర్తిస్తారు.
 2. బొంగురు గొంతు వచ్చినప్పుడు వెంటనే డాక్టర్ కు చూపిస్తే “స్వరపేటిక కాన్సర్” అయిందీ కానిదీ నిర్ణయించి తగిన వైద్యం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
 3. త్వరగా మానని పుండు, త్వరగా పెరిగే కణితులు శరీరంలో ఎక్కడ ఉన్నా అవి కాన్సర్ హెచ్చరికలు కావచ్చు. డాక్టర్ తో పరీక్ష చేయించుకోవడం మంచిది.
 4. ఆడవాళ్ళు అప్పుడప్పుడు రొమ్ములను స్వయంగా పరీక్షించుకొని రొమ్ము కాన్సర్ ను తొలిదశ లోనే గుర్తించవచ్చు. (పరీక్షించుకునే విధానం డాక్టర్ నడిగి తెలుసుకోవచ్చు). అలాగే “పాప్ స్మియర్” అనే చిన్న పరీక్ష ద్వారా గర్భసంచి కాన్సర్ ను ప్రారంభ దశలోనే గుర్తించి, వైద్యం చేయించుకోవచ్చు.

పక్షవాతం :

జబ్బుల్లోకెల్లా పరమ నికృష్టమైన అతిథి రోగం పక్షవాతం. అంటే చెప్పాపెట్టకుండా ఆకస్మికంగా వచ్చిపడే రోగమన్నమాట. రక్తపోటు, మధుమేహం ఉన్నవాళ్ళకు ఈ జబ్బును ఊహించవచ్చు. తగిన వ్యాయామాలు, మందులతో ఆ రెండింటినీ అదుపులో వుంచుకుంటే పక్షవాతానికి కొంత దూరంగా ఉంటారు.
ఒక్కసారి పక్షవాతం వచ్చిన వారికి మరోమారు రావడం, మరింత నష్టం జరగడం కూడా కద్దు. మళ్ళీ మళ్ళీ పక్షవాతం రాకూదదనుకొంటే, బి.పి., షుగర్ లను అదుపు చేసుకుంటూ డాక్టర్ సలహాతో ఇతర మందులు కూడా వాడుతూ ఉండాలి.
మనిషి జీవితం అనంతం కాదు. బ్రతికినంత కాలం ఆరోగ్యవంతమైన సార్థక జీవితం గడపాలంటే….

 1. బలవర్ధకమైన ఆహారం తీసుకోండి.
 2. రుచిగా ఉంది గదాని దేన్నీ అమితంగా లాగించవద్దు.
 3. రక్షిత మంచినీరు త్రాగండి.
 4. పరిసరాల పరిశుభ్రతను పాటించండి.
 5. ధూమపానం, మద్యపానం వంటి వ్యసనాలకు దూరంగా ఉండండి.
 6. చెమట పట్టే విధంగా రోజూ కనీసం అరగంటైనా నడవండి. లేదా ఆటలాడండి.
 7. రక్తపోటు, చక్కర వ్యాధులను అదుపులో ఉంచుకోండి.
 8. ఒక మనిషికి నెలకు అరకిలో నూనె మాత్రమె వాడండి.
 9. సాధ్యమైనంత వరకు ఉప్పు వాడకం తగ్గించుకోండి.
 10. జీవిత భాగస్వామితో మాత్రమే సెక్స్ సంబంధం పెట్టుకోండి. ఈ నియమం పాటించనప్పుడు నిరోధ్ తప్పక వాడండి. వాడినా ఎయిడ్స్ నుండి 100% రక్షణ ఉండదని గుర్తుంచుకోండి.
 11. పెళ్ళికి ముందే వధూవరులిద్దరూ హెచ్.ఐ.వి. పరీక్ష చేయించుకోండి.
 12. సక్రమంగా పెంచి, తీర్చిదిద్దగల వనరులేర్పరచుకొని మాత్రమే సంతానాన్ని కనండి.
 13. వ్యాధులకు వైద్యం కన్నా, వ్యాధుల నివారణకే ప్రయత్నించండి.
 14. ఆఖరిదైనా అతి ముఖ్యమైనది – మనతో బాటు మన తోటి వాళ్ళంతా బాగుండాలని కోరుకొని, పాటుపడండి.
సర్వేజనాః సుఖినోభంతు!

డా. దాసరి రామకృష్ణ ప్రసాదు
పద్మావతి ఆసుపత్రి
చల్లపల్లి, కృష్ణాజిల్లా, ఆంద్రప్రదేశ్.

16-02-2010వ తేదీన ‘ప్రజాశక్తి’ దినపత్రికలో ప్రచురించబడినది.