స్వచ్ఛ సుందర చల్లపల్లి – 28-06-2018

ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం.
 
స్వచ్ఛ కార్యకర్తల 1325* రోజుల నిస్వార్థ నిరంతర సేవ
 
వర్షం కారణంగా నేటి కార్యక్రమం కోసం సెంటర్ లో కలుద్దామని నిర్ణయించుకున్నాము. సెంటర్ కి వెళ్ళగానే ముప్పనేని మెడికల్స్ ముందు నీరు నిలిచిపోయి చెరువు లాగా ఉంది. ఇక్కడ మొదలైన డ్రెయిన్ నాగాయలంక రోడ్డులో ఎడమవైపు నుండి పెట్రోల్ బంకు, వైశ్య బజారు మీదుగా లాయర్ నాథ్ గారి ఇంటి వద్ద ఎడమవైపు తిరిగి గుర్రాల చెరువులో కలుస్తుంది. ఈ ప్రాంతంలో రోడ్డుమీద పడిన నీళ్ళు అక్కడక్కడ చిన్న గొట్టాల ద్వారా ఈ డ్రెయిన్ లో కలుస్తాయి. ఈ గొట్టాల్లో చిన్న చిన్న రాళ్ళు, క్యారీ బ్యాగులు, ప్లాస్టిక్ గ్లాసుల వల్ల డ్రెయిన్ పూడిపోయి నీళ్ళు ప్రవహించటం లేదు. ఈ గొట్టాలు ఎక్కడెక్కడున్నాయో మన కార్యకర్తలకు తెలుసు. వాటన్నింటికీ ఉన్న అడ్డులను తొలగించి నీరు పారేట్లు చేశారు. డ్రెయిన్ లో ఒక చోట మురుగు కదలటం లేదని చూసి పైనున్న బల్లలను తీసి చూస్తే లోపల పెద్ద పెద్ద రాళ్ళు మురుగు ప్రవాహానికి అడ్డంగా ఉన్నాయి. డ్రెయిన్ లోకి దిగి వాటన్నింటినీ బయటకి తీసి మళ్ళీ బల్లలను వాటి స్థానంలో పెట్టారు. డ్రెయిన్ బల్లలపై ఉప్పు బస్తాలు ఉండటం వలన బల్లలను తీయటం కష్టమైంది. *డ్రెయిన్లలో మురుగు పారుదల వ్యవస్థను సరి చేయటానికి డ్రెయిన్ లపై ఉన్న ఆక్రమణలు చాలా ఇబ్బందిగా ఉన్నాయి. పంచాయితీ వారు ఇటువంటివన్నీ తీయించవలసిందే*. ఇలా నాథ్ గారి ఇంటి వరకు మురుగు పారని అన్నిచోట్ల బల్లలు తీసి అడ్డులను తొలగించి మళ్ళీ బల్లలను సరిచేశారు. ఆ తరువాత బస్టాండ్ వైపు వెళ్తే బస్టాండ్ ముందు కోట గోడ వైపు పెద్ద చెరువు వలే నీరు నిలిచిపోయింది. పెదకళ్ళేపల్లి వైపు వెళ్ళే బస్టాండ్ ముందు డ్రెయిన్ ను ఎంతో కష్టపడి డ్రెయిన్ లో దిగిమరీ మురుగు పారేట్లు శుభ్రం చేశారు. అనేకచోట్ల క్యారీబ్యాగులు, ప్లాస్టిక్ మంచినీళ్ళ సీసాలు డ్రెయిన్ ని పూడ్చేశాయి. వర్షంలో తడుస్తున్నప్పటికీ ఈ కార్యక్రమాన్ని కొనసాగించిన 20 మంది కార్యకర్తలను అభినందించడానికి నాకు మాటలు దొరకటం లేదు.
 
గురవయ్య మాష్టారి నినాదాలు, కొటేషన్లతో నేటి కార్యక్రమం ముగిసింది.
 
రేపటి కార్యక్రమం కోసం “వర్షం వస్తే సెంటర్”లో,
వర్షం లేకపోతే “రిజిస్ట్రార్ ఆఫీస్” వద్ద కలుద్దాం.
 
284 రోజులుగా స్వచ్ఛ నారాయణరావు నగర్ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
 
డా. దాసరి రామకృష్ణ ప్రసాదు
మేనేజింగ్ ట్రస్టీ, మనకోసం మనం ట్రస్ట్
స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త
గురువారం – 28-06-2018
 
బహుజన హితాయ – బహుజన సుఖాయ
 
ఆఫీసులు – ఖాళీదొడ్లు అన్ని అందగించగలరు
స్మశానాన్ని నందనంగా మార్చి మనకు చూపగలరు
ఒకచో మురుగెత్తగలరు – రోడ్లు తుడిచి కడుగగలరు
స్వచ్ఛ సైనికులు మాత్రం బహు రూపాలెత్తగలరు!
 
-నల్లూరి రామారావు
స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త
 
 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>